తెలంగాణ గ్రూప్-2,3 పరీక్షలు వాయిదా వేయాలనే అభ్యర్ధుల విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పరీక్షలను రీషెడ్యూల్ చేసి త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని ఎంపీ మల్లు రవి తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఉదయం సచివాలయంలో ఈ అంశంపై అభ్యర్ధులతో చర్చించారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మద్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో రెండు పరీక్షలకు హాజరవ్వాలనుకునేవారు పూర్తిగా సన్నద్ధం కాలేరని కనుక గ్రూప్-2,3 పరీక్షలు వాయిదా వేయాలని, ఈసారి షెడ్యూల్ ప్రకటించేతప్పుడు ఈవిదంగా రెండు పరీక్షలు క్లాష్ అవ్వకుండా మద్యలో ఎక్కువ గ్యాప్ ఉండేలా చూడాలని అభ్యర్ధులు కోరారు.
వారి అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క అప్పటికప్పుడు టీజీపీఎస్‌ఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి పరీక్షలు వాయిదాపై పునః పరిశీలించాలని, వీలైతే డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ చర్చలలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. 783 గ్రూప్-2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.