బడ్జెట్‌ సమావేశాలలోనే జాబ్ క్యాలండర్‌: సిఎం రేవంత్‌

July 21, 2024
img

మంగళవారం నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాటిలోనే జాబ్ క్యాలండర్‌ను ప్రకటిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇక నుంచి ఏటా మార్చి 31వ తేదీలోగా అన్ని ప్రభుత్వ శాఖలలో ఏర్పడిన ఖాళీల వివరాలను తెప్పించుకొని జూన్ 2వ తేదీలోగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసి, డిసెంబర్‌ 9వ తేదీలోగా పరీక్షల ప్రక్రియ పూర్తిచేసి ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందిస్తామని చెప్పారు. 

జాబ్ క్యాలండర్‌లో ఎప్పుడు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయో, వాటికి ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నామో  ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలండర్‌ వస్తే నిరుద్యోగులు ఇదివరకులా ఏళ్ళ తరబడి జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. 

తెలంగాణ ఏర్పాటులో నియామకాలు కూడా ఒకటని, కానీ గత ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం వలన టీజీపీఎస్‌ఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించలేకపోవడంతో లక్షలాది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్‌ఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్-1 ప్రిలిమ్స్ విజయవంతంగా నిర్వహించామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. యూపీఎస్సీ తరహాలోనే ఇకపై జాబ్ నోటిఫికేషన్స్, పరీక్షలు అన్నీ నిర్వహిస్తామని చెప్పారు. గ్రూప్-2,3 అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు ఆ పరీక్షలు నవంబర్‌-డిసెంబర్‌ నెలల్లో నిర్వహిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.       


Related Post