కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మళ్ళీ బ్రేక్!

October 20, 2023
img

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మళ్ళీ బ్రేక్ పడింది. ప్రశ్నాపత్రంలో నాలుగు ప్రశ్నలను తప్పుగా ఇచ్చినందుకు పరీక్ష వ్రాసిన అభ్యర్ధులందరికీ నాలుగు మార్కులు చొప్పున కలిపిన తర్వాత మళ్ళీ ఫలితాలను ప్రకటించాలని రాష్ట్ర హైకోర్టు ఈ నెల మొదటి వారంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుని ఆదేశించిన సంగతి తెలిసిందే. 

కోర్టు ఆదేశాల ప్రకారం మళ్ళీ ఫలితాలు విడుదల చేసేందుకు సిద్దపడుతుంటే, ఆలోగా అర్హత సాధించిన అభ్యర్ధులకు వైద్య పరీక్షలు, వారి పూర్వపరాలు పరీక్షించడం సరికాదంటూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దానీ  విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధుల జాబితాను నిలిపివేయాలని గురువారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుని ఆదేశించింది.

దీంతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రాష్ట్రంలో పోలీస్ కమీషనర్లకు, ఎస్పీలకు లేఖలు వ్రాసింది. అక్టోబర్ 4వ తేదీన ప్రకటించిన ఫలితాలలో ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధులకు వైద్య పరీక్షలు, వారి పూర్వపరాలు పరీక్ష ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని కోరింది. కనుక కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో తెలీని పరిస్థితి. దీంతో నేడో రేపో నియామక పాత్రలు చేతికి అందుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Related Post