పోలీస్ శాఖలో నియామకాలు... ఇంకా ఎంత కాలం?

October 10, 2023
img

తెలంగాణ పోలీస్ శాఖలో 16,604 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి ఏడాదిపైనే అయ్యింది. ఇది ఎన్నికల గంట మోగేవరకు సాగుతూనే ఉంటుందని ఆనాడే అందరూ ఊహించారు. అదే నిజమైంది. నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. 

ప్రశ్నాపత్రాలలో 27 ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్ధులు పిటిషన్‌ వేయడంతో హైకోర్టు వాటిపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకి ఆదేశాలు జారీ చేసింది. వాటిలో నాలుగు ప్రశ్నలు తొలగించి, వాటి కొరకు అభ్యర్ధులకు నాలుగు మార్కులు చొప్పున కలపాలని ఆదేశించింది. మిగిలిన 23 ప్రశ్నలపై దాఖలైన అభ్యంతరాలను హైకోర్టు పరిశీలించవలసి ఉంది. కనుక ఈ భర్తీ ప్రక్రియ ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. 

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఫలితాలలో మొత్తం 15,750 మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు. వారందరూ నియామక పత్రాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ పరీక్షల ప్రశ్నలను, మార్కులు కలపడం, తొలగించడం మొదలుపెడితే భర్తీ ప్రక్రియ మళ్ళీ మొదటికి రావచ్చు. కనుక ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులు కూడా ఆందోళన చెందుతున్నారు. 

మిగిలిన వాటిలో 350 పోస్టులపై న్యాయవివాదం ఉంది. కనుక వాటి ఫలితాలు ఇప్పుడే ప్రకటించలేమని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తేల్చి చెప్పేసింది. వాటికి ఎప్పుడు హైకోర్టు క్లియరెన్స్ లభిస్తుందో తెలీదు. 

సోమవారం తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కనుక భర్తీపై ఆ ప్రభావం కూడా పడుతుందేమోనని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో తెలీదు.

Related Post