రెండు రోజుల క్రితం విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలలో రంగారెడ్డి జిల్లాలోని ఒక్క మంచాల మండలంలో నుంచే 76 మంది యువతీ యువకులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒక్క మంచాల గ్రామంలోనే 17 మంది ఎంపిక కాగా, ఆరుట్ల పంచాయతీ పరిధిలో 11 మంది ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
బోదకొండ నుంచి ఐదుగురు, లోయపల్లి, ఆగాపల్లి, బండలేమూర్, తాళ్లపల్లి నుంచి చెరో నలుగురు, ఎల్లమ్మ తండా, చిత్తాపూర్, తిప్పాయి గూడ, అజ్జినా తండా, చెన్నారెడ్డిగూడ, నోముల, కొర్రం తండా నుంచి తలో ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు.
పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో నివాసం ఉంటున్న కర్తాలా కృష్ణారెడ్డి, సుజాత దంపతుల ఇద్దరు కుమారులు పృధ్వీరెడ్డి, శరత్ చంద్రా రెడ్డి ఇద్దరూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవడంతో వారి తల్లితండ్రుల సంతోషానికే అవధులే లేవు. వీరిలో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా, కోచింగ్ తీసుకొనేందుకు ఆర్ధిక స్తోమతు లేకపోయినా అందరో ఇళ్ళలోనే చదివి ఈ ఉద్యోగాలకు అర్హత సాధించారు.