తెలంగాణ గ్రూప్-1 పరీక్షలు (ప్రిలిమ్స్) మరోసారి రద్ధు అయ్యాయి. మొదట ప్రశ్నాపత్రాలు లీక్ అయినందున రద్దు చేయగా, జూన్ 11న జరిగిన పరీక్షలలో బయోమెట్రిక్ విధానం అమలుచేయకపోవడం, హాల్ టికెట్ నంబర్ లేకుండానే అభ్యర్ధులకు ఓఎంఆర్ షీట్లు ఇచ్చినందుకు హైకోర్టు ఈ పరీక్షలను రద్దు చేసింది.
ఈ అవకతవకలను కొందరు అభ్యర్ధులు పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్ళీ ఇటువంటి అవకతవకలకు తావీయకుండా వీలైనంత త్వరగా మళ్ళీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించాలని టిఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. దీంతో రెండోసారి ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్ధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయినప్పుడే ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రేవంత్ రెడ్డి వంటివారైతే ఈ లీకేజి వెనుక మంత్రి కేటీఆర్ కార్యదర్శి హస్తం ఉందని, కోట్లు రూపాయలు చేతులు మారాయని సంచలన ఆరోపణలు చేశారు.
టిఎస్‌పీఎస్సీ లీకేజి వ్యవహారంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలతో కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. ఒకసారి పరీక్షలలో అవకతవకలు జరిగితే ప్రభుత్వం ఎలాగో సమర్ధించుకోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే ఎంతకని సమర్ధించుకోగలదు? టిఎస్‌పీఎస్సీ తప్పులకు కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతోంది.