పోలీస్ ఉద్యోగాలకు శారీరిక పరీక్షల తేదీ ఖరారు

November 16, 2022
img

తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఓ శుభవార్త! అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేహ ధారుఢ్య పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. వీలైతే ఈ నెలాఖరు నుంచి లేదా డిసెంబర్‌ మొదటివారం నుంచి ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించడానికి పోలీస్ రిక్రూట్మెంట్‌ బోర్డు ఏర్పాట్లు ప్రారంభించింది. 

దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కో పరీక్ష కేంద్రం (మైదానం)లో పోలీస్ అధికారులు, సిబ్బంది కలిపి  130 మంది చొప్పున ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్ధుల ఎంపికలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రతీ మైదానంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించబోతోంది. 

అన్ని ఏర్పాట్లు పూర్తయితే ఈ నెలాఖరు నుంచి లేదా వచ్చే నెల మొదటివారం నుంచి ఈ దేహధారుడ్య పరీక్షలు మొదలుపెట్టి 25-30 రోజులలోపు పూర్తిచేయాలని పోలీస్ రిక్రూట్మెంట్‌ బోర్డు భావిస్తోంది. ఈ పరీక్షలో గట్టెక్కితే 75శాతం ఉత్తీర్ణులైనట్లే ఆ తర్వాత ఫైనల్ రాత పరీక్ష వ్రాస్తే సరిపోతుంది. దానిలో కూడా ఉత్తీర్ణులైతే పోలీస్ ఉద్యోగం లభిస్తుంది. కనుక ప్రాధమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులందరూ ఈదేహ ధారుఢ్య పరీక్షల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఈసారి వివిద శాఖలలో పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొన్నవారు, ఈ ఒక్క దేహధారుడ్య పరీక్షలో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే వారు దరఖాస్తు చేసుకొన్న అన్ని ఉద్యోగాలకు ఇదే సరిపోతుంది. మళ్ళీ వేర్వేరుగా దేహధారుడ్య పరీక్షలకు హాజరు అవ్వక్కర లేదు.


Related Post