గ్రూప్-1 రాస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

October 10, 2022
img

తెలంగాణ ప్రభుత్వంలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టిఎస్‌పీఎస్సీ ప్రిలిమానరీ పరీక్ష నిర్వహించబోతోంది. 503 పోస్టులకు జరుగబోతున్న ఈ పరీక్షకు మొత్తం 3,80,202 మంది అభ్యర్ధులు హాజరుకాబోతున్నారు. కనుక నిన్న ఆదివారం నుంచి ఈ పరీక్ష హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అనుమతిస్తోంది. ఈ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులకు టిఎస్‌పీఎస్సీ ఈరోజు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కనుక అందరూ తప్పనిసరిగా వీటిని పాటించవలసి ఉంటుంది. ఆ వివరాలు... 

• పరీక్ష జరిగే సమయానికి పావుగంట ముందుగా అంటే ఉదయం 10.15 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయబడతాయి. 10.15 తర్వాత లోనికి ఎవరినీ అనుమతించరు. కనుక అభ్యర్ధులందరూ ఆ లోపుగానే చేరుకోవలసి ఉంటుంది. అందరూ ఉదయం 8.30 గంటలకే చేరుకోవాలని టిఎస్‌పీఎస్సీ సూచించింది. 

• అభ్యర్ధులు అందరూ తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవలసి ఉంటుంది. హాల్ టికెట్‌ని ఏ-4 సైజులో స్పష్టంగా అన్ని వివరాలు కనబడేలా ప్రింట్ తీయించి తెచ్చుకోవాలి.    

• సంతకం, ఫోటో స్పష్టంగా లేని హాల్ టికెట్‌తో అభ్యర్ధులను లోనికి అనుమతించరు. కనుక ఒకవేళ హాల్ టికెట్‌లో అభ్యర్ధి సంతకం, ఫోటో స్పష్టంగా ప్రింట్ కానట్లయితే మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలపై గెజిటెడ్ అధికారి చేత దృవీకరణ పత్రం తీసుకొని ఇన్విజిలెటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

• అభ్యర్ధులు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయబడే బయోమెట్రిక్ మెషీన్‌లో విధిగా హాజరువేసుకోవలసి ఉంటుంది. లేకుంటే లోనికి అనుమతించరు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించినవారు మెయిన్స్ కి హాజరైనప్పుడు మళ్ళీ బయోమెట్రిక్ హాజరు వేసుకోవలసి ఉంటుంది. రెంటిలో తేడా ఉంటే అనుమతించరు.  

• తప్పుడు  దృవపత్రాలతో లేదా వేరొకరి తరపున పరీక్షకు హాజరైతే అభ్యర్ధులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అనర్హులుగా వేటు వేస్తామని టిఎస్‌పీఎస్సీ హెచ్చరించింది. 

• పరీక్షా పత్రం చేతికి ఇచ్చిన వెంటనే దానిలో మొత్తం 150 ప్రశ్నలు అచ్చు పడ్డాయో లేదో పరిశీలించుకొని తక్కువ ఉంటే తక్షణం ఇన్విజీలేటర్‌కు తెలియజేసి మరో పత్రం అడిగి తీసుకోవాలి. 

• ప్రశ్నాపత్రంపై ఎక్కడ జవాబులు వ్రాయకూడదు. ఓఎంఆర్ షీట్లో పేర్కొన్న చోట కాకుండా మరెక్కడైనా హాల్ టికెట్‌ నంబరు వ్రాసినా, లేదా ఏవైనా గుర్తులు వేసినా దానిని చెల్లని పత్రంగా పరిగణిస్తారు.   

• పరీక్షా సమయం ముగిసేవరకు ఎవరినీ బయటకి అనుమతించరు. 

• అభ్యర్ధులు బూట్లు ధరించరాదు. చెప్పులు వేసుకొన్నవారికి మాత్రమే అనుమతించబడతారు. 

• చేతులు, శరీరంపై ఎక్కడా గోరింటాకు లేదా టాటూలు వేసుకోరాదు. వేసుకొంటే లోనికి అనుమతించరు. 

• ఓఎంఆర్‌ పత్రంలో తప్పులను సరిచేసుకోవడానికి వైట్నర్, చాక్ పౌడర్, రబ్బర్, బ్లేడ్ వాడరాదు. వాడితే ఆ జవాబులను పరిగణనలోకి తీసుకోరు. 

• ఓఎంఆర్‌ పత్రాలను ముందుగా డిజిటల్ స్కానింగ్ చేసిన తర్వాత డిజిటల్ ఓఎంఆర్‌ కాపీలను టిఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. 

• ఓఎంఆర్‌ పత్రాలపై తప్పనిసరిగా అభ్యర్ధి, ఇన్విజీలేటర్ ఇద్దరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కరి సంతకం లేకున్నా ఆ పత్రాలను మూల్యాంకనానికి తీసుకోరు.  

• ఈ పరీక్షల విషయంలో అభ్యర్ధులకు ఎటువంటి సందేహాలున్నా ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయబడుతున్న  హెల్ప్ డెస్కు సిబ్బందిని సంప్రదించవచ్చు.  


Related Post