ఛార్మీ విచారణ షురూ..ఏమి చెపుతుందో?

July 26, 2017


img

డ్రగ్స్ కేసులో నోటీసు అందుకొన్న నటి ఛార్మీ సిట్ విచారణకు హాజరుకక తప్పదని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆమె కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకొన్నారు. ఆమెను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ చేయాలని హైకోర్టు సూచించినందున, ఆమె కార్యాలయానికి రాగానే 5వ అంతస్తులోని విచారణ గదికి తీసుకువెళ్ళి సిట్ అధికారులు ఆమెను విచారించడం మొదలుపెట్టారు. ఆమెను మహిళా అధికారులే విచారించాలనే హైకోర్టు ఆదేశాల ప్రకారం ముగ్గురు మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఎక్సైజ్ శాఖ న్యాయవాది సమక్షంలో ఛార్మీని ప్రశ్నిస్తున్నారు. 

ఈ డ్రగ్స్ కేసులతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, తాను ఎన్నడూ డ్రగ్స్ తీసుకాలేదని ఛార్మీ గట్టిగా వాదిస్తున్నప్పటికీ ఈ కేసులో ఆమెనే కీలకసాక్షిగా సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కనుక ఈరోజు విచారణలో ఆమె కొత్తగా ఎవరెవరి పేర్లు చెపుతుందో..కొత్త విషయాలు ఏమి చెపుతుందో ఎవరూ ఊహించలేరు. 

ఈ డ్రగ్స్ కేసులలో నిందితులుగా పేర్కొనబడిన సినీ ప్రముఖులను విచారణలో సిట్  అధికారులు ఏమి ప్రశ్నలు అడుగుతున్నారో నిందితులుకానీ, సిట్ అధికారులు గానీ బయటపెట్టనప్పటికీ, లోపల జరుగుతున్న విచారణ ప్రక్రియను స్వయంగా చూసివచ్చినట్లు కొన్ని మీడియా ఛానల్స్ ఏవేవో ఊహించి ప్రసారం చేసేస్తుండటం విశేషం. వాటిని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఖండించకపోవడం వలన విచారణ గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిజమనే భావన ప్రజలలో కలిగే ప్రమాదం ఉంది. ఈ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన నవదీప్ కూడా ఇదే విషయం ప్రస్తావించి మీడియాపై విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 


Related Post