సిఎం కెసిఆర్ ప్రతిపాదనను స్వాగతించిన ఉద్యోగ సంఘాలు

May 26, 2018


img

రాష్ట్రంలో కొత్తగా 7 జోన్స్, 2 మల్టీ జోన్స్ ఏర్పాటు చేయాలనే సిఎం కెసిఆర్ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలన్నీ స్వాగతించాయి. అయితే వాటిలో కొన్ని మార్పులు సూచించాయి. టి-ఎన్జివోఏ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్ లో సమావేశం జరిగింది. దానిలో తెలంగాణా ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాల నేతలు పాల్గొని కొత్త జోన్ వ్యవస్థపై లోతుగా చర్చించారు. అనంతరం దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఉందని గుర్తించారు. అవేమిటంటే..

1. నాలుగవ జోన్ పేరును భద్రాద్రిని భద్రాద్రి కాకతీయగా మార్చాలి.

2. జనగామ జిల్లాను యాదాద్రిలో కాకుండా భద్రాద్రి జోన్ లోకి చేర్చాలి.

3. వికారాబాద్ జిల్లాను జోగుళాంబలో కాకుండా ఛార్మినార్ జోన్ లోకి చేర్చాలి.

4. రంగారెడ్డి జిల్లాను ఛార్మినార్ లో కాకుండా జోగుళాంబ జోన్ లోకి మార్చాలి.

5. ఏ క్యాడర్ లోనైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్లలో లోకల్ రిజర్వేషన్ కోటా 85 శాతంగా ఉండాలి.

6. 15 శాతం ఓపెన్ క్యాటగిరీకి కేటాయించాలి.

7. జిల్లాల నుంచి సచివాలయానికి జరిగే బదిలీలలో అన్ని జోన్లకు న్యాయబద్దమైన వాటా కల్పించాలి.

8. ఉద్యోగాల భర్తీ విధానంలో జిల్లా, జోనల్, మల్టీ జోన్, రాష్ట్ర క్యాడర్ అనే నాలుగు అంచెల విధానాన్ని అమలుచేయాలి.

9. తెలంగాణా యువతకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించేందుకు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు మినహా రాష్ట్రస్థాయి పోస్టులను అన్నిటినీ మల్టీ జోనల్ పోస్టులుగా పరిగణించాలి. 

10. గ్రూప్-1 నుంచి ఐఏఎస్, ఐపిఎస్ వరకు అన్ని ఉద్యోగాల పదోన్నతులలో కూడా  80 శాతం తెలంగాణా వారికే రిజర్వ్ చేయాలి.   

సిఎం కెసిఆర్ ప్రతిపాదించిన కొత్త జోన్స్ వ్యవస్థ వలన రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు శాశ్వితంగా సమస్యలు పరిష్కరించినట్లు అయ్యిందని, తాము సూచించిన ఈ చిన్నచిన్న మార్పులు, చేర్పులను సిఎం కెసిఆర్ ఆమోదిస్తారనే భావిస్తున్నామని టి-ఎన్జివోఏ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సిఎస్ జోషీకి లిఖితపూర్వకంగా తమ ఈ సూచనలను అందజేస్తామని కారం రవీందర్ రెడ్డి చెప్పారు. 


Related Post