టిఆర్టి అభ్యర్ధులకు ఇదే లాస్ట్ చాన్స్

February 15, 2018
img

టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్-2018కు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులకు తమ దరఖాస్తులలో తప్పులు సవరించుకోవడానికి టి.ఎస్.పి.ఎస్.సి. మరో ఆఖరి అవకాశం కల్పించింది. ఈరోజు (గురువారం) ఉదయం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు దరఖాస్తులలో తప్పులు సవరించుకోవడానికి అవకాశం కల్పించినట్లు టి.ఎస్.పి.ఎస్.సి.కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలిపారు. 

ఈ పోస్టులకు మొదట 31 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ వెలువరించి, దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ పాత 10 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్స్ జారీ చేసింది. కనుక ఇదివరకు 31 జిల్లాల ప్రాతిపదికన దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు అందరూ మళ్ళీ 10 జిల్లాల ప్రాతిపదికన దరఖాస్తులలో ఆప్షన్స్ మార్చుకోవలసి ఉంటుంది. అందుకు ఇదే ఆఖరి అవకాశం. రేపటిలోగా ఆప్షన్స్ మార్చుకొని అభ్యర్ధులకు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు హాల్ టికెట్స్ జారీ చేయబడవని వాణీ ప్రసాద్ తెలిపారు. కనుక అభ్యర్ధులు అందరూ ఈరోజే టి.ఎస్.పి.ఎస్.సి.వెబ్ సైట్ లో ఆన్-లైన్ ద్వారా తమ దరఖాస్తులలో ఆప్షన్స్ సరిచూసుకోవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 19 నుంచి హాల్ టికెట్స్ జారీ చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. 

ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మార్చిలోగా సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక మళ్ళీ టిఆర్టికి ఎప్పుడు నోటిఫికేషన్స్ విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. కనుక అభ్యర్ధులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొంటే మంచిది. ముందుగా టిఆర్టి దరఖాస్తులలో తప్పులు సవరించుకోవడం చాలా అవసరం. 

Related Post