దటీజ్ ఎయిర్ ఇండియా!

November 13, 2017
img

దేశంలో ఏ ప్రభుత్వ సంస్థలోనైనా సాధారణంగా కనిపించే అలసత్వం, నిర్లక్ష్య ధోరణికి ఎయిర్ ఇండియా కూడా అతీతం కాదని గతంలో అనేకసార్లు నిరూపితమైంది. దానినే మొన్న గురువారంనాడు మళ్ళీ మరోమారు నిరూపించి చూపింది ఎయిర్ ఇండియా.

గురువారం ఉదయం 7.50 గంటలకు ఎయిర్ ఇండియా విమానం విశాఖపట్నం నుంచి డిల్లీకి బయలుదేరింది. కానీ అది టేకాఫ్ తీసుకొనే ముందు దానిలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ దానిని మళ్ళీ విమానాశ్రయం వద్దకు తీసుకువచ్చి ప్రయాణికులు అందరినీ దింపివేశారు. ఎయిర్ ఇండియా అధికారులు వారినందరినీ విమానాశ్రయం ‘లాంజ్’ లో కూర్చోబెట్టారు. తమను వేరే విమానంలో డిల్లీకి పంపిస్తారని ఎదురుచూస్తున్న ప్రయాణికులను గంటలు గడిచినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఎయిర్ ఇండియా అధికారులు వారికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతామనే భయంతో కొంతమంది వేరే ప్లేన్ లో టికెట్స్ కొనుకొని వెళ్ళిపోగా మిగిలినవారు విమానాశ్రయంలోనే ఎదురుచూస్తూ కూర్చొన్నారు. 

వారు ఆవిధంగా ఉదయం 8.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు కూర్చోవలసివచ్చింది. ప్రయాణికులలో వృద్ధులు, మహిళలు, పసిపిల్లలు ఉన్నారు. ఈ సంగతి తెలిసి కూడా ఎయిర్ ఇండియా అధికారులు వారికి కనీసం మంచినీళ్ళు, పాలు, ఆహారం అందించలేదు. ప్రయాణికులు అక్కడ వేచి చూస్తుండగానే అధికారులు తమ డ్యూటీ సమయం పూర్తయిందంటూ వెళ్ళిపోగా తరువాత షిఫ్ట్ అధికారులు వచ్చారు. చివరికి రాత్రి 11.00 గంటలకు విమానం మరమత్తులు పూర్తవడంతో, అది అర్ధరాత్రి సుమారు 12 గంటలకు మిగిలిన ప్రయాణికులతో డిల్లీకి బయలుదేరింది. 

సామాన్యప్రజలు సైతం విమానాలలో ప్రయానించేందుకు వీలుగా పౌరవిమానయాన శాఖ పలు సంస్కరణలు చేపడుటోంది. వాటిలో భాగంగానే టికెట్ ధరలు తగ్గించడం, చిన్న చిన్న పట్టణాలకు కొత్త రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభిస్తోంది. కానీ క్షేత్ర స్థాయి సిబ్బందిలో ఇంత తీవ్ర నిర్లక్ష్యం ఆవహించి ఉన్నప్పుడు ఏ సంస్థ అయినా ఏవిధంగా లాభాలు ఆర్జించగలదు? అటువంటి సంస్థను ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడగలరా? విమాన ప్రయాణికులు సుమారు 16 గంటలపాటు విమానాశ్రయంలోనే పడిగాపులు కాయవలసి వచ్చిందంటే ఎయిర్ ఇండియా పనితీరు ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. మొన్న ఇండిగో..నేడు ఎయిర్ ఇండియా రేపు మరొకటి..ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే.    


Related Post