శాకుంతలం నుంచి మల్లికా మల్లికా మృదుమధురమైన గీతం

January 19, 2023
img

ఒకప్పుడు మనసుకవి ఆత్రేయ చిన్న చిన్న పదాలతో క్లా లోతైన భావాలను వ్యక్తం చేసే అనేక గీతాలు రచించి తెలుగు సినీ సాహిత్యాన్ని మరో స్థాయికి చేర్చారు. ముఖ్యంగా మనసుకి సంబందించి ఆయన వ్రాసిన గేయాలు నేటికీ మనసులని ఆర్ద్రపరుస్తుంటాయి. మళ్ళీ చాలా కాలం తర్వాత అటువంటి చక్కటిపాట శాకుంతలం సినిమాలో వినిపించింది. మల్లికా మల్లికా... అంటూ చైతన్య ప్రసాద్ చిన్న చిన్న పదాలతో అద్భుతంగా వ్రాసిన ఈ పాటని రమ్య బెహరా బృందం మధురాతి మధురంగా ఆలపించారు. ఆ లిరికల్ వీడియో సాంగ్‌ని టిప్స్ ఆడియో సంస్థ విడుదల చేసింది. దుష్యంత మహారాజుని గాంధర్వ వివాహం చేసుకొన్న శకుంతల గర్భం దాల్చి అతని కోసం ఎదురుచూపులు చూస్తోందని తెలియజేయవలసిందిగా హంసలని, పక్షులని కోరుతున్నట్లు సాగే ఆ పాట చాలా మృదుమధురంగా ఆనాటి ఆత్రేయ పాటలని గుర్తుకు తెస్తోంది.      

శాకుంతలం సినిమాలో అడవిలో దుష్యంతుడి కోసం ఎదురుచూస్తున్న సమంత ఫోటోలని నిర్మాత నీలిమ గుణ ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఆ పాట, దానిలో సమంత స్టిల్స్ చూస్తే గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభ, శేఖర్ వి జోసెఫ్ కెమెరా పనితనం స్పష్టంగా కనబడుతుంది.  

ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్‌ దుష్యంత మహారాజుగా నటిస్తున్నాడు. శకుంతల,దుష్యంతుల పౌరాణిక ప్రేమ గాధ ఆధారంగా నిర్మింపబడుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ చిన్నారి భరతుడిగా కనిపించబోతోంది. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఫిభ్రవరి 17వ తేదీన శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.Related Post