ఆదిపురుష్‌కి పోటీగా హనుమాన్... టీజర్‌ చూసి తీరాల్సిందే!

November 21, 2022
img

‘ఆదిపురుష్‌’ సినిమా ఫస్ట్-లుక్‌, టీజర్‌పై వచ్చిన విమర్శల గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. కానీ ‘జాంబి రెడ్డి’ సినిమాతో తెలుగులో సరికొత్త కధాంశంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ‘హనుమాన్’ అనే పేరుతో మళ్ళీ యువనటుడు తేజ సజ్జాతోనే తన 4వ సినిమాగా సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ నేడు విడుదల చేశారు. కేవలం రూ.12 కోట్లు బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా  టీజర్‌ చూసినప్పుడు వందల కోట్లు బారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్‌’ టీజర్‌ దిగదుడుపుగానే కనిపిస్తుంది. అంత గొప్పగా ఉంది హనుమాన్ టీజర్‌... దానిలో విజువల్స్. ఇది కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతుండటం మరో విశేషం. 

ఒక కొండ నిలువెత్తు హనుమంతుడి విగ్రహంతో ‘రామ్...’ అంటూ టీజర్‌ ఓపెన్ చేసి, చివరికి ఒక మంచు శివలింగంలో హనుమంతుడు తపస్సు చేసుకొంటున్నట్లు ముగించారు. ఆ మంచు శివలింగంలో హనుమంతులవారి హృదయంలో దివ్యజ్యోతి వెలుగుతుండటం, తోక కదులుతున్నట్లు చూపడం అద్భుతంగా ఉంది.  మద్యలో హీరో హీరోయిన్‌, విలన్ల పరిచయం కూడా అద్భుతంగా ఉంది.  

ఈ సినిమాలో తేజసజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్‌భవన్‌ దీపక్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.   

ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సురభి, కెమెరా: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: ఎస్‌బి రాజు తలారి. 

హనుమాన్ సినిమాను గత ఏడాది జూన్ 25వ తేదీన హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభించి ఆగస్ట్ నాటికే సుమారు 40 శాతం షూటింగ్‌ పూర్తిచేశారు. 2022, ఫిబ్రవరిలో విడుదల చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 

   

Related Post