రాజమౌళి సినిమాలో నటించాలనే కోరిక లేదు: చిరంజీవి

October 01, 2022
img

ఇప్పుడు దేశంలో నటీనటులందరూ ఒక్కసారైనా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని కలలు కంటున్నారు. కారణం అందరికీ తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటులలో ఒకరైన మహేష్ బాబు త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తాను రాజమౌళితో సినిమాలు చేయదలచుకోలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దానికి చాలా బలమైన కారణాలే చెప్పారు.

రాజమౌళి ఒక్కో సినిమా పూర్తి చేయడానికి రెండు మూడేళ్ళు సమయం తీసుకొంటారని తాను ఆయనకు అంత సమయం కేటాయించలేనని చెప్పారు. ఆయన మూడేళ్ళకో సినిమా తీస్తుంటే తాను ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ఇక రాజమౌళి ప్రతీ విషయాన్ని చాలా లోతుగా పరిశీలించి గొప్పగా తీస్తుంటారని కానీ తాను ఆయన ఆశించిన స్థాయిలో నటించలేకపోవచ్చునని చిరంజీవి అన్నారు. అందుకే రాజమౌళి అంటే ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఆయన పాన్ ఇండియా సినిమాలలో నటించి కొత్తగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక, తాపత్రయం రెండూ తనకు లేవని చిరంజీవి చెప్పారు. అయితే తన నటవారసుడు రామ్ చరణ్‌ రాజమౌళి సినిమాలో చేసి మంచి పేరు తెచ్చుకోవడం తనకు చాలా సంతోషం కలిగించిందని, అది తనకు లభించిన గుర్తింపు, గౌరవంగానే భావిస్తున్నానని చిరంజీవి అన్నారు. 

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన గాడ్ ఫాదర్‌ సినిమా ఈనెల 5వ తేదీన విడుదల కాబోతోంది.

Related Post