భారతీయుడు-2 నుంచి తొలి పాట… శౌరా!

May 23, 2024


img

కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో జూలై 12న విడుదల కాబోతున్న భారతీయుడు సినిమా నుంచి ‘శౌరా....’  అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. సుద్దాల అశోక్ తేజ వ్రాసిన ఈ పాటని అనిరుధ్ స్వరపరచగా, రితేష్ రావు, శ్రుతిక సముద్రాల ఆలపించారు. 

భారతదేశాన్ని బ్రిటిష్ సైన్యంతో ఆక్రమిస్తున్నప్పుడు వారిని మన ‘భారతీయుడు’ కమల్ హాసన్ ఏవిదంగా ఎదుర్కొన్నారో తెలియజేస్తూ సాగిన పాట ఇది కనుక చాలా రౌద్రంగానే సాగింది. కానీ మద్యలో నల్లపూసలైన చాలయ్యా... అంటూ దేశం కోసం పోరాడేందుకు వెళ్ళిన ఆ వీరుడు కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్‌ ఆర్తిగా పాడిన ఓ చరణం మద్యలో చాలా చక్కగా జోడించి మళ్ళీ శౌరా... అంటూ పాటను ముగించడం బాగుంది. 

కమల్ హాసన్ గుర్రంపై సవారీ చేస్తున్న దృశ్యాలను, యుద్ధభూమిని కెమెరా మ్యాన్ రవి వర్మన్ చాలా అద్భుతంగా చూపారు. అనిరుధ్ సంగీతం కూడా ఆ సన్నివేశాలను మరింత రక్తి కట్టించింది. భారతీయుడు-2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ జూన్ 1వ తేదీన ఉంటుందని ఈ పాట ముగింపులో తెలియజేశారు.

భారతీయుడు మొదటి భాగంలో స్వాతంత్ర్యం తర్వాత దేశంలో అవినీతిపరులను ఏవిదంగా అంతమొందించాడో చూపారు. కనుక చాలా ఏళ్ళ తర్వాత దానికి సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు-2లో భారత్‌లోని వర్తమాన పరిస్థితులను చూపిస్తారనుకుంటే, ఈ పాట ద్వారా ఫ్లాష్ బ్యాక్‌కు తీసుకువెళ్లి బ్రిటిష్ వారితో జరిగిన పోరాటాలను చూపడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఈ సినిమాలో కమల్ హాసన్, ఎస్‌జె సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, సిద్ధార్ధ్, బాబీ సింహా, వివేక్, బాలీవుడ్‌ నటులు గుల్షన్ గ్రోవర్, పీయూష్ మిశ్రా, జాకీర్ హుస్సేన్, అఖిలేంద్ర మిశ్రా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, మనోబాల, ప్రియా భవానీ శంకర్, నెడుమూడి వేణు, ఢిల్లీ గణేశ్, జగన్, కాళిదాస్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు డైలాగ్స్: హనుమాన్ చౌదరి, సంగీతం: అనిరుధ్, కెమెరా: రవి వర్మన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, యాక్షన్: అంబర్వి, రంజాన్ బులూత్, అరసు, పీటర్ హెయిన్స్, స్టంట్ శివ, త్యాగరాజన్, కొరియోగ్రఫీ: బోస్కో సీజర్, బాబా భాస్కర్ చేశారు. 

రెడ్ జయంత్ మూవీస్ బ్యానర్‌పై సుబాస్కారన్ ఈ సినిమాని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించి జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

    



Related Post

సినిమా స‌మీక్ష