నేడు వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లా, బాసరలోని సుప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.
ఈ రోజు తెల్లవారుజామున 1.30 గంటల నుంచే శ్రీ జ్ఞాన సరస్వతి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాకాళి అమ్మవార్లకు మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ చేసి అనంతరం అభిషేకాలు చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెల్లవారుజామునే ఆలయానికి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
నేడు వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిచడం ఆనవాయితీ. కనుక వందలాదిమంది భక్తులు తమ చిన్నారులను వెంటబెట్టుకొని తెల్లవారుజాము నుంచే శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో క్యూలైన్లలో నిలబడ్డారు.
తల్లితండ్రులు పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకోగా ఆలయ అర్చకులు వారి చేత అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. చిన్నారుల కేరింతలతో ఆలయం కళకళలాడింది.