దొంగలున్నారు జాగ్రత్త: విసి సజ్జనార్‌ హెచ్చరిక

January 10, 2026
img

హైదరాబాద్‌ సిపి విసి సజ్జనార్‌ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. సంక్రాంతి పండుగకు సొంత ఊర్లు వెళుతున్నవారు ఇళ్ళు తాళాలు వేసి వెళితే ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయే ప్రమాదం ఉంది కనుక నగర ప్రజలు ఊర్లకు బయలుదేరే ముందే తమ విలువైన వస్తువలన్నీ బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇంట్లో నగదు, వెండి బంగారు ఆభరణాలు ఉంచవద్దని సూచించారు. 

ఊర్లు వెళుతున్నవారు తమ ఇంటి తాళం చెవిని పక్కవారికి ఇవ్వవద్దని సూచించారు. చెప్పుల స్టాండులో, మొక్కల కుండీలో, డోర్ మ్యాట్ కింద ఇంటి తాళం చెవి పెడుతుంటారని దొంగలకు కూడా తెలుసు కనుక అక్కడా పెట్టవద్దని, తాళం చెవిని తమతో తీసుకుపోవాలని విసి సజ్జనార్‌ సూచించారు.     

గతంలో జరిగిన దొంగతనాల రికార్డులన్నీ పరిశీలించి ఆయా ప్రాంతాలలో అదనపు గస్తీ, నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే తమ ప్రయాణం గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్‌ చేస్తే దొంగలకు తాము ఇంట్లో లేమని తెలియజేసినట్లవుటుందని గుర్తుంచుకోవాలని విసి సజ్జనార్‌ సూచించారు. ఇంటి పరిసరాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లయితే వెంటనే 100 నంబరుకి ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని విసి సజ్జనార్‌ సూచించారు.

Related Post