మెగాభిమానంతో రోడ్డున పడ్డ అభిమాని!

January 10, 2026
img

సినీ నటుల అభిమానులు వీరాభిమానం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఆ అభిమానం ముదిరిపోయి రోడ్డున పడ్డవారు కూడా ఉన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని భవానీ నగర్‌ కాలనీకి చెందిన భట్టు బాలాజీ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మన కళ్ళ ముందే ఉన్నారు. 

బాలాజీకి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా అభిమానం... అని అనే కంటే చాలా పిచ్చి అని చెప్పొచ్చు. ఆ పిచ్చి మొదటిరోజు మొదటి షో చూడటం వరకే పరిమితం అయితే నేడు అయన రోడ్డున పడేవారే కారు. కానీ ‘స్టేట్ రౌడీ’ సినిమా టికెట్ల కోసం క్యూలైన్లో జరిగిన కొట్లాటలో ఎడమ కన్ను పోగొట్టుకున్నారు! చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఖర్చులు ఆయనే భారించేవారు. 

హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే సొంత ఖర్చులతో మానుకోట నుంచి 150 మంది హైదరాబాద్‌ తీసుకువెళ్ళి వారిచేత రక్తదానం చేయించారు!

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలలోకి వచ్చినప్పుడు, సభలు, సమావేశాలు, ఊరేగింపుల కోసం మూడెకరాలు అమ్మేసి ఖర్చు చేశారు!

ఈ మెగాభిమానం వలన ఉద్యోగం, ఉపాధి లేకుండా పోయింది. తాతతండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కరిగిపోవడంతో బాలాజీ కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది!

ఇప్పుడు ఆయన భార్య ఊర్లోనే పూలు అమ్ముకుంటుంటే, ఇద్దరు పిల్లలు ఇతరుల ఇళ్ళలో పనిమనుషులుగా పనిచేస్తున్నారు. అయినా కుటుంబ అవసరాలు తీరడం లేదు. అప్పులు పెరుగుతూనే ఉన్నాయి.

కనుక తమ కుటుంబాన్ని చిరంజీవే ఆదుకోవాలని వేడుకొంటున్నారు. కానీ ఇదేమీ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా కాదు.. మన శంకర వరప్రసాద్ గారు పరిగెత్తుకొచ్చి ఆదుకోవడానికి... అని అర్థం చేసుకొని, ఇకనైనా ఈ పిచ్చాభిమానం పక్కన పెట్టి ఏదైనా ఉద్యోగం, ఉపాధి చూసుకోవడం మంచిది.


Related Post