కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

October 24, 2025
img

ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. హైదరాబాద్‌ నుంచి  బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సుని వెనుక నుంచి ఓ బైక్‌ డీకొన్నప్పుడు పెట్రోల్ ట్యాంకులో మంటలు మొదలయ్యాయి. 

ఓ పక్క భారీ వర్షం కురుస్తుండగానే క్షణాలలో మంటలు బస్సు అంతటా వ్యాపించి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేశారు. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇద్దరు డ్రైవర్లు కాకుండా 41 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పారిపోయారు. 

ప్రమాద సమయంలో ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలో ఉండటంతో మేల్కొని ఏం జరిగిందో తెలుసుకునేలోగానే మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. వారిలో 12 మంది అత్యవసర ద్వారాలు తెరిచి దూకేసి ప్రాణాలతో బయటపడ్డారు. మరో 9 మంది ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మిగిలిన 21 మంది సజీవ దహనం అయ్యారు. 

ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికి తీశామని, మిగిలినవారి మృతదేహాలు వెలికితీసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి బాధితుల పరిస్థితి, వివరాల కొరకు కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ నం: 08518-277305కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ సిరి తెలిపారు.

Related Post