శనివారం హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు జరుగబోతున్నాయి. కనుక వాటిని చూసేందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరం నలుమూలల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. కనుక రేపు ఉదయం 6 గంటల నుంచి గణేశ్ నిమజ్జనాలలో పాల్గొన్నవారు ఇళ్ళు చేరుకునేందుకు వీలుగా అర్దరాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్‌లో అన్ని మెట్రో రైళ్ళు తిరుగుతాయని మెట్రో అధికారులు తెలిపారు.
ఇప్పటికే కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఈ ఆదివారం చంద్రగ్రహణం ఉన్నందున రేపు శనివారమే నగరంలో ఖైరతాబాద్ గణేశ్‌తో సహా సుమారు 50, 000 విగ్రహాలు నిమజ్జనం చేస్తారు.
వినాయక నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ షూటింగ్, హుస్సేన్ సాగర్ వద్ద 40 భారీ క్రేన్లు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. వినాయక నిమజ్జనాల కోసం నగరంలో వివిధ ప్రాంతాలలో గల 34 చెరువులు వినియోగిస్తారు. వీతితో పాటు నగరంలో మరో 64 తాత్కాలిక మినీ చెరువులు కూడా ఏర్పాటు చేశారు.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ఎటువంటి అవాంచిత సంఘటనలు జరుగకుండా నగరంలో ఎస్ఎస్ఎంబీ29,000 మంది పోలీసులను మొహరించారు.
నగరంలో శోభాయత్రాలు జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాలను వేరే మార్గాలలోకి మళ్ళిస్తున్నారు. గణేశ్ నిమజ్జనాలు పూర్తయ్యేవరకు బహుశః సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగించే అవకాశం ఉంది.