ఏపీలో ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో విశాఖ నగరం ఒకటి. ఆర్‌కే బీడ్, తీరం వెంబడి అనేక అందమైన పార్కులు, ఒడ్డునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం, ఫైటర్ జెట్ మ్యూజియం, రోడ్డుకి ఇవతలవైపు మహనీయుల విగ్రహాలున్నాయి.
కాస్లాత ముందుకు సాగితే కైలాసగిరి, దానిపైకి చేరుకునేందుకు రోప్ వే, పక్కనే సముద్రం ఒడ్డున అందమైన తెన్నేటి పార్కు, ఆ పార్కుకి మరింత ప్రత్యేకత ఏర్పరిచేందుకే ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు బంగ్లాదేశ్‌కి చెందిన పెద్ద షిప్పు ఉన్నాయి.
త్వరలోనే ఆ షిప్పులో రెస్టారెంట్ ప్రారంభం కాబోతోంది. సముద్ర తీరం వెంబడి అలా ముందుకు సాగుతుంటే దారిలో రుషికొండ బీచ్, పక్కనే కొండపై టిటిడీ ర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కనిపిస్తాయి.
మరి కాస్త ముందుకు సాగితే హరేకృష్ణ మందిర్, ఇంకాస్త ముందుకు సాగితే భీమిలి బీచ్... ఇలా ఒకటా రెండా అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి.
ఇవికాక సుప్రసిద్ధ వరాహలక్ష్మీనరసింహ స్వామివారి సింహాచలం దివ్యక్షేత్రం, కనక మహాలక్ష్మి, సంపత్ వినాయక స్వామి ఆలయాలున్డినాయి.
నగరంలో పాత పోస్టాఫీస్ ప్రాంతంలో సముద్రం ఒడ్డునే ఓ కొండపై శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, మరోకొండపై చర్చి, మరో కొండపై మసీదు అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి.
ఇటీవలే ఆర్‌కే బీడ్ సముద్ర తీరం పక్కనే సాగే రోడ్డు మార్గంలో డబుల్ డెక్కర్ బస్సులను ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తాజాగా కైలాసగిరి కొండపై గ్లాస్ బ్రిడ్జ్ రెడీ అవుతోంది. అతి త్వరలోనే దీని ప్రారంభోత్సవం కాబోతోంది.
రూ. 10 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరి కొండ అంచు నుంచి 55 మీటర్లు పొడవుతో గాల్లో వ్రేలాడుతున్నట్లు ఉంటుంది. దీని ఫ్లోరింగ్ పారదర్శకమైన అద్దాలతో నిర్మించారు. కనుక కొండ శిఖరం అంచున గాల్లో వ్రేలాడుతున్నట్లు ఉండే ఈ అద్దాల వంతెనపైకి వెళ్ళడానికి చాలా గుండె ధైర్యం ఉండాలి.
కనుక ఈసారి విశాఖ వెళ్తే తప్పకుండా కైలాసగిరి కొండపైకి రోప్ వే ద్వారా చేరుకుంటే అపూర్వమైన అనుభూతి లభిస్తుంది. ఆ తర్వాత కొండపై తిరిగే మినీ ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే ఓ పక్క సముద్రం, మరోపక్క విశాఖ నగరం, కొండలు కనువిందు చేస్తాయి.
మరిచిపోకుండా కైలాసగిరి కొండపైనే కొత్తగా నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జి కూడా తప్పక ప్రయత్నించాల్సిందే!