సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఘనంగా లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి.
ఆనవాయితీ ప్రకారం ముందుగా ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని తొలిపూజ చేసి బోనం సమర్పించుకున్నారు. ఆ తర్వాత సామాన్య భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని బోనాలు సమర్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేయనున్నారు.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయంలో జరిగే లష్కర్ బోనాలను ప్రజలు తమ ప్రత్యేకమైనవిగా భావిస్తుంటారు. కనుక రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
కనుక 2,500 మంది పోలీసులను మోహరించి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వందల మంది జీహెచ్ఎంసీ పారిశుద్య సిబ్బంది ఆలయ పరిసరాలను, ఆలయానికి వెళ్ళే అన్ని మార్గాలలో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.
భక్తుల సౌకర్యార్ధం మంచి నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, అత్యవసర వైద్యం కోసం వైద్య శిబిరాలు, అంబులెన్సులు, మొబైల్ టాయిలెట్లు వంటి సకల ఏర్పాట్లు చేశారు.
అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం ఆలయం నిర్వాహకులు ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనంతో వచ్చిన మహిళల వెంట ఐదుగురు కుటుంబ సభ్యులను లోనికి అనుమతిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వంటి గంట నుంచి మూడు గంటల వరకు కేవలం శివసత్తులు, జోగినులకు మాత్రమే ఆలయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తారు.
రేపు (సోమవారం) రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు.