అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం

June 12, 2025
img

అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈరోజు మద్యాహ్నం 1.17 గంటలకు లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. 

విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు,  53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు. 

విమానం టేకాఫ్ అయిన వెంటనే రన్ వే అవతల ఉన్న బిజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌పై కూలిపోయింది. భోజన సమయం కావడంతో హాస్టల్లో చాలా మంది వైద్య విద్యార్ధులున్నారు. విమానం కూలిన వెంటనే మంటలు అంటుకున్నాయి. 

ఈ ప్రమాదంలో వంద మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కానీ విమానం హాస్టల్ మీద కూలిపోయినందున అంత కంటే చాలా ఎక్కువ మందే చనిపోయి ఉండవచ్చు. 

ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పుతూ విమానంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చారు. 

విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు, వైద్య బృందాలు, జిల్లా అధికారులు, ఇతర సహాయ బృందాలు అక్కడకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. 

విమానం టేకాఫ్ అయిన తర్వాత ఓ చెట్టుని ఢీకొట్టి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. అంటే నిర్ధిష్ట సమయంలో నిర్ధిష్టమైన ఎత్తుకు ఎగరలేకపోవడం వలన ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. 

ఈ విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇంకా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు  దిగ్బ్రాంతి, సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు. 

ప్రధాని మోడీతో సంబంధిత అధికారులతో అత్యవసరం సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.         

Related Post