యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ భామలు

May 16, 2025
img

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ అందాల పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 110 దేశాల అందాల భామలు గురువారం సాయంత్రం యాదగిరి గుట్ట దేవస్థానాన్ని సందర్శించారు. అందరూ పట్టు చీరలు, పట్టు పరికిణీలు  కట్టుకొని, నుదుట బొట్టు, తలలో పూలు పెట్టుకొని వచ్చారు. ఆలయ విశిష్టతని అధికారులు వివరిస్తుండగా, అందరూ ఆలయ ప్రకారాలు, మాడ వీదులలో తిరుగుతూ ఆలయ అందాలను, బంగారు తాపటం చేసిన ఆలయ గోపురాన్ని చూసి పరవశించిపోయారు. 

ఆ తర్వాత అందాల భామలందరూ మాడవీధిలో చాలా ఆనందంగా కోలాటం ఆడుతూ, చూస్తున్నవారిని కూడా ఆనందింపజేశారు. తర్వాత ఆలయ ఆవరణలో ఫోటో షూట్‌లో పాల్గొని గ్రూప్ ఫోటోలు, భక్తులతో సెల్ఫీలు దిగారు. అనంతరం తూర్పు గోపురంలో నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆలయంలోని అఖండ దీపానికి అందాల భామలు నూనె పోస్తూ మురిసిపోయారు. 

మిస్ వరల్డ్ పోటీల కోసం తామందరం హైదరాబాద్‌ వచ్చినప్పటికీ ఈ ఆలయ, పర్యాటక కేంద్రాల పర్యటనలు తమ జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులు ఇచ్చాయని వారు చెప్పారు. యాదగిరిగుట్టకు వచ్చే ముందు అందరూ పోచంపల్లిలో పర్యటించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి చీరలను ఏవిదంగా తయారు చేస్తారో కళ్ళారా చూసి చాలా సంతోషించారు. 

 


Related Post