హైదరాబాద్ నగరం నడిబొడ్డున అఫ్జల్ గంజ్ సమీపంలో మహరాజ్ గంజ్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఓ భవనంలో రెండు అంతస్తులలో ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్స్ వగైరా నిలువచ్చేసే గోదాములు ఉన్నాయి. మూడో అంతస్తులో ఆ గోదాము యజమాని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. భవనం పక్కనే విద్యుత్ స్తంభం ఉంది. దాని వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో భవనంలో నిలువ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులకు మంటలు వ్యాపించాయి. క్షణాలలోనే మంటలు భవనం అంతా వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన అక్కడకు చేరుకొని 5 అగ్నిమాపక యంత్రాలతో అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఆ చుట్టూపక్కల ఇటువంటి వస్తువులే అమ్మే అనేక దుకాణాలు ఉన్నాయి. కానీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని మంటలు వ్యాపించకుండా ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఓ వైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతూనే మరోవైపు మూడో అంతస్థులో చిక్కుకున్న కుటుంబాన్ని క్రేన్ సాయంతో భద్రంగా కిందకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు. వారిలో ఓ చిన్నారి కూడా ఉంది.