లాడ్ బజార్‌లో షాపింగ్.. చౌమహల్లా ప్యాలస్‌లో విందు!

May 14, 2025
img

మిస్ వరల్డ్ 2025 పోటీలలో పాల్గొనేందుకు 110 దేశాల నుంచి వచ్చిన అందాల భామలు మంగళవారం ఛార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు ‘హెరిటేజ్ వాక్’లో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతం, నృత్యాలతో స్వాగతం పలికారు. వారి సంగీతం, నృత్యాలు ఆస్వాదించిన అందాల భామలు వారితో ఫోటోలు దిగారు.

ఛార్మినార్ అందాలు, చారిత్రిక ప్రాశస్త్యం గురించి తెలుసుకుని అక్కడ అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు.

ఆ తర్వాత లాడ్ బజార్ వరకు నడుస్తూ దారిలో ప్రజలను పలకరిస్తూ భారతీయ సాంప్రదాయం ప్రకారం వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా పలువురు స్థానికులతో సెల్ఫీలు దిగారు. 

లాడ్ బజార్‌లో ఆభరణాల దుకాణాలలో షాపింగ్ చేశారు. గాజులు, ముత్యాల హారాలు, చెవులకు పెట్టుకునే దుద్దులు, ఉంగరాలు వంటివి కొనుగోలు చేశారు. వాటికి వారు డబ్బు చెల్లించబోతే దుకాణాల యజమానులు ‘మీరు మా అతిధులు’ అంటూ సున్నితంగా తిరస్కరించారు. ఛార్మినార్-లాడ్ బజార్ పర్యటన, షాపింగ్ తమకు మధురానుభూతి కలిగించిందని వారు తెలిపారు.  

అనంతరం అందరూ చౌమహల్లా ప్యాలస్‌ చేరుకోగా వారికి హిందూస్తానీ షాహనాయి సంగీతం, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలును తెలియజెప్పే నృత్యాలతో వారికి ఘన స్వాగతం చెప్పారు. అత్యంత విలాసవంతమైన ఆ చౌమహల్లా ప్యాలస్‌ని చూసి అందాల భామలు ఆశ్చర్యపోయారు. నిజాం వంశస్థుల రాజసింహాసనం, వారు వాడిన ఆయుధాలను ఆసక్తిగా చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున చౌమహల్లా ప్యాలస్‌లో అందాల భామలకు ఏర్పాటు చేసిన విందుని ఆస్వాదించారు. సిఎం రేవంత్ రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు, నటుడు అక్కినేని నాగార్జున, నిర్మాతలు దగ్గుబాటి సురేష్, అల్లు అరవింద్, హీరోయిన్‌ శ్రీలీల, సికింద్రాబాద్‌ మిలటరీ కళాశాల కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ వార్షినే, ఈనాడు గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్ తదితరులు ఈ విందులో పాల్గొన్నారు. 

Related Post