మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే జంప్?

April 19, 2024


img

లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని, మళ్ళీ తామే అధికారంలోకి రాబోతున్నామన్నట్లు నిన్ననే కేసీఆర్‌ మాట్లాడారు. కానీ అంతకంటే ముందు బిఆర్ఎస్ పార్టీయే ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోగా ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారు. 

ప్రకాష్ గౌడ్ గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. వారిద్దరూ టిడిపిలో ఉన్నప్పుడూ కలిసి పనిచేసినందున ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. కనుక రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే ప్రకాష్ రెడ్డి వెళ్ళి ఆయనను అభినందించి వచ్చారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా రేవంత్‌ రెడ్డి ఆయనను ఆహ్వానించగా, ఇప్పుడు చేరేందుకు ప్రకాష్ రెడ్డి సిద్దమయ్యారు. ఒకటి రెండు రోజులలోనే ఆయన బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఖైరతాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

బి‌ఐ‌ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీలు గోడెం నగేశ్, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బిజెపీలో చేరిపోయి ఆ పార్టీ అభ్యర్ధులుగా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. కనుక లోక్‌సభ ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ పార్టీకి వరుసపెట్టి పెద్ద ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.        



Related Post