పదో తరగతి విద్యార్థులకు ఓ శుభవార్త! వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో జరుగబోయే వార్షిక పరీక్షలలో ఆరు పేపర్లే ఉంటాయి. గత ఏడాది కరోనా కారణంగా పదో తరగతిలో 11 పేపర్లకు బదులు 6 పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలనే విద్యాశాఖ ప్రతిపాదనకు సిఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఇదివరకు హిందీకి ఒకటి, మిగిలిన సబ్జెక్టులు అంటే తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రాలకు ఒక్కో దానికి రెండు పేపర్లు చొప్పున పరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులు 11 పేపర్లు వ్రాయవలసి వచ్చేది కానీ ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు ఒక్క పేపర్ చొప్పున పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.