శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో తెరాస స్పందించదేమిటి?

November 22, 2017
img

మేడ్చల్ జిల్లాలో బోడుప్పల్ కు చెందిన తెరాస నేత పి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు భార్యల వ్యవహారం మీడియాలో ప్రముఖంగా వస్తున్నా ఇంతవరకు తెరాస స్పందించకపోవడం విచిత్రంగా ఉంది. అతను మొదట ఒక మహిళను వివాహం చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చాడు. తరువాత  సెప్టెంబర్ 2011లో సంగీత అనే ఆమెను వివాహం చేసుకొన్నాడు. ఆమెకు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో వీధిలో అందరూ చూస్తుండగానే ఆమెను తిట్టి కొట్టి రోడ్డుపైకి ఈడ్చిపడేశాడు. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోగానే శ్రీనివాస్ రెడ్డి మరో మహిళను వివాహం చేసుకొన్నాడు. ఈ విషయం తెలుసుకొన్న సంగీత గత నాలుగు రోజులుగా తన కూతురుతో కలిసి తన భర్త ఇంటిముందు ధర్నా చేస్తోంది. ఆమె తల్లితండ్రులు పోలీసులకు పిర్యాదు చేయడంతో శ్రీనివాస్ రెడ్డి, అతని తల్లి తండ్రులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు వారిని వెతికి పట్టుకొని అదుపులో తీసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే తనకు న్యాయం జరిగేవరకు భర్త ఇంటి ముందు నుంచి కదలనని సంగీత మొండికేసి కూర్చోవడంతో స్థానిక మహిళా సంఘాలు కూడా ఆమెతో బాటు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నాయి. 

ఆమెను భర్త కొట్టి బయటకు గెంటివేసినప్పటి నుంచి ఈ విషాదకర పరిణామాల గురించి ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తెరాస నేత చేసిన ఈ నిర్వాకం గురించి తెరాస నేతలు, మంత్రులు ఎవరూ ఇంతవరకు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది. 

ఈ కేసుపై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ స్పందిస్తూ, “ఆమె తన భర్త నుంచి రూ.3 కోట్లు భరణం కొరుకొంటోంది. దీనిపై ఇరువర్గాల మద్య చర్చలు సాగుతున్నాయి. భరణం విషయంలో మేము కలుగజేసుకోలేము కానీ ఈ కేసు విషయంలో మాత్రం ఆమెకు పూర్తిన్యాయం జరిగేలా చూస్తాము,” అని చెప్పారు.         


Related Post