సంగారెడ్డి వ్యవసాయ అధికారిణి ఆత్మహత్య

November 27, 2020
img

సంగారెడ్డి జిల్లాలోని రైతు శిక్షణాకేంద్రంలో వ్యవసాయ అధికారిణి (ఏఓ)గా పనిచేస్తున్న అరుణ (34) ఆత్మహత్య చేసుకొన్నారు. గురువారం మధ్యాహ్నం ఆమె సంగారెడ్డి నుంచి తన కారు (నెంబర్ టిఎస్15 ఈడీ0403)లో నారాయణ ఖేడ్ బయలుదేరి దారిలో మనూరు మండలంలో రాయిపల్లి వద్ద మంజీరానదిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నారు. తాను అక్కడ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వరుసకు తమ్ముడైన పవన్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. దాంతో అతను పోలీసులకు, ఆమె భర్త శివశంకర్‌కు సమాచారమిచ్చి అక్కడకు చేరుకొన్నాడు. అక్కడ వంతెనపై ఆమె కారు, హ్యాండ్ బ్యాగ్, చెప్పులు కనిపించడంతో ఆమె చెప్పింది నిజమేనని స్పష్టమైంది. నారాయణ్ ఖేడ్ సీఈ రవీందర్ రెడ్డి, రాయికోడ్ ఎస్‌ఐ ఏడుకొండలు అక్కడకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నదిలో ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఆమె కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం అరుణకు సంగారెడ్డికి చెందిన శివశంకర్‌తో నాలుగేళ్ళ క్రితం వివాహం జరిగింది. వారికి రుద్రవీర్ (3), విరాట్ (11 నెలలు) ఇద్దరు కుమారులున్నారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మద్య మనస్పర్ధలు ఏర్పడటంతో ఇరువురి పెద్దలు వారికి నచ్చజెప్పారు. కానీ వారి మద్య ఇంకా గొడవలు కొనసాగుతుండటంతో భరించలేక అరుణ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని తెలుస్తోంది. అరుణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. అరుణ ఇదివరకు మనూరు, నారాయణ్ ఖేడ్, ఖల్హర్‌లలో ఏఓగా పనిచేశారు.

Related Post