కాంగ్రెస్‌ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి

November 25, 2020
img

కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) బుదవారం తెల్లవారుజామున మృతి చెందారు.  ఆయనకు సుమారు నెలరోజుల క్రితం కరోనా సోకడంతో అప్పటి నుంచి ఢిల్లీ సమీపంలోని గురుగావ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కానీ క్రమంగా ఆయన శరీరంలో అంతర్గత అవయవాలు పనిచేయకపోవడంతో బుదవారం తెల్లవారుజామున కనుమూశారు. ఈ విషయం ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

గుజరాత్‌కు చెందిన అహ్మద్ పటేల్ తొలిసారిగా 1977లో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. క్లిష్ట పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అండగా నిలబడ్డారు. ఓ ఎంపీగా కంటే సోనియా గాంధీ రాజకీయ సలహాదారుగానే అహ్మద్ పటేల్ ఎక్కువగా గుర్తింపు పొందారంటే అతిశయోక్తి కాదు. ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఓ వెలుగువెలిగారని చెప్పవచ్చు.

Related Post