గొర్రెకుంట హంతకుడికి ఉరిశిక్ష ఖరారు

October 29, 2020
img

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌కుమార్ యాదవ్‌ను వరంగల్‌ జిల్లా సెషన్స్ కోర్టు దోషిగా నిర్దారించి ఉరిశిక్ష వేస్తున్నట్లు బుదవారం తీర్పు ప్రకటించింది. 10 మందిని అత్యంత పాశవికంగా హత్యలు చేసినందుకు అతనికి ఉరిశిక్ష సరైనదని న్యాయమూర్తి జయకుమార్ తీర్పులో పేర్కొన్నారు. 

 బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ యాదవ్‌ (24) పొట్టకూటి కోసం వరంగల్‌ వచ్చాడు. అతనికి వరంగల్‌ నగర శివార్లలో గోనెసంచులు కుట్టుకొని జీవిస్తున్న మక్సూద్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్ భార్య పేరు నిషా. ఆమె అక్క కూతురు రఫీకా (31) భర్త నుంచి విడిపోయి తన ముగ్గురు పిల్లలతో మక్సూద్ దంపతుల వద్దనే ఉంటూ పనిచేసుకొంటోంది. 

సంజయ్‌కుమార్ ఆమెతో మెల్లగా పరిచయం పెంచుకొని పెళ్ళి చేసుకొంటానని నమ్మించి గీసుకొండ మండలంలోని జాన్‌పాక వద్ద ఓ ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే సంజయ్‌కుమార్ ఆమె మైనర్ కుమార్తెపై కూడా కన్నేసి లోబరుచుకొనే ప్రయత్నాలు చేస్తుండటం చూసి రఫీకా అతనిని గట్టిగా నిలదీసింది. దాంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొన్నాడు. వైజాగ్‌లో ఉంటున్న తమ పెద్దవాళ్ళకు చెప్పి పెళ్ళి చేసుకొందామని ఆమెకు నచ్చచెప్పి మార్చి 6న గరీబ్ రధ్ రైల్లో తీసుకువెళ్ళాడు. దారిలో ఆమెకు మత్తుమందు కలిపిన మజ్జిగ ఇచ్చి నడుస్తున్న రైల్లో నుంచి తోసేసి మళ్ళీ వరంగల్‌ తిరిగివచ్చేశాడు.

అయితే అతను ఒక్కడే తిరిగిరావడంతో మక్సూద్ భార్య నిషా రఫీకా ఎక్కడుందని గట్టిగా నిలదీసింది. అతను పొంతనలేని సమాధానాలు చెపుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అప్పటికేదోలాగా ఆమెకు, మిగిలినవారికి సర్దిచెప్పాడు కానీ మక్సూద్ కుటుంబంలో ఏ ఒక్కరూ బ్రతికి ఉన్నా వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని అప్పుడు దర్యాప్తులో తాను రఫీకాను హత్య చేసిన విషయం బయటపడుతుందని గ్రహించిన సంజయ్‌కుమార్ మొత్తం అందరినీ హత్య చేయాలని నిశ్చయించుకొన్నాడు. 

దాని కోసం మే 16 నుంచి ఐదు రోజులపాటు ప్రతీరోజు మక్సూద్ కుటుంబం పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్ళి అక్కడి పరిసరాలను గమనించాక, వారు నివాసం ఉంటున్న భవనం పక్కనే ఓ పాడుబడ్డ బావి ఉన్నట్లు గుర్తించాడు. అందరినీ ఆ బావిలో పడేసి హత్య చేయాలని నిశ్చయించుకొన్నాడు. 

మే20న మక్సూద్ పెద్ద కొడుకు షాబాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు రాత్రి వారందరూ బిర్యానీ చేసుకొన్నారు. సంజయ్‌కుమార్ కూడా ఆ విందుకు హాజరయ్యాడు. వారికి తెలియకుండా బిర్యానీలో 60 నిద్రమాత్రలను కలిపేశాడు. అదే ఇంట్లో పైన ఉంటున్న శ్యామ్, శ్రీరామ్ అనే ఇద్దరు అనుకోకుండా ఆ సమయంలో అక్కడికి వచ్చారు. వారిని వదిలేస్తే వారు తన గురించి పోలీసులకు చెపుతారని భావించిన సంజయ్‌కుమార్ పైకి వెళ్ళి వారితో కబుర్లు చెపుతూ తాను తెచ్చిన నిద్రమాత్రలను వారు తయారుచేసుకొన్న భోజనంలో కూడా కలిపేశాడు. 

ఆ తరువాత అందరూ గాఢనిద్రలోకి జారుకొన్న తరువాత అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు సంజయ్‌కుమార్ ఒకరొకరినీ తీసుకువెళ్లి పక్కనే ఉన్న బావిలో పడేశాడు. అందరూ నిద్రమత్తులో ఉండగానే ఊపిరాడక చనిపోయారు. 

మక్సూద్ ఇంటి యజమానికి ఎవరూ కనబడకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి చుట్టుపక్కల వెతుకగా బావిలో 9 మృతదేహాలు కనుగొన్నారు. ఆ తరువాత సంజయ్‌కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసి విచారించగా ఈ హత్యలన్నీ తానే చేశానని అంగీకరించాడు. పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టుకు అందించడంతో న్యాయమూర్తి సంజయ్‌కుమార్ యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. 

సంజయ్‌కుమార్ యాదవ్‌ చేతిలో హత్యకు గురైనవారు: 

రఫీకా(31), మహమ్మద్ మక్సూద్ (50), నిషా(45), షాబాద్ (22), సొహైల్ (20), బుస్రా (20), బుస్రా కుమారుడు (3), షకీల్ (30), శ్యామ్ (22), శ్రీరామ్ (20).

Related Post