జగిత్యాలలో రైతుల ఆందోళన...తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

October 23, 2020
img

జగిత్యాల జిల్లాకేంద్రంలో ‘ఛలో కలెక్టరేట్’ పేరుతో మక్క, వరి రైతులు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మక్కలకు జిల్లా కేంద్రంలో కొనుగోలుకేంద్రం ఏర్పాటు చేయాలని, టన్నుకు రూ.2,500 కనీస మద్దతు ధర ప్రకటించాలని, తడిసిన బియ్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్థానిక ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనరాకపోవడంతో మక్క, వరి రైతులు శుక్రవారం ర్యాలీ చేపట్టారు. 

ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ముందే ప్రకటించడంతో పోలీసులు జిల్లా కేంద్రంలో సెక్షన్ 144 విధించి కర్ఫ్యూ అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తుజాగ్రత్త చర్యగా నిన్న రాత్రి నుంచే పోలీసులు పలువురు రైతునాయకులను, రాజకీయనాయకులను గృహనిర్బందంలో ఉంచారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి లేదని మైకులలో ప్రకటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో భారీగా పోలీసులను మోహరించి, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రైతులు ఎవరూ ఊళ్ళోకి ప్రవేశించకుండా అడ్డుకొంటున్నారు.

అయినప్పటికీ ఇవ్వాళ్ళ ఉదయం నుంచి వందలాదిమంది రైతులు జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులో తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఇరువర్గాలకు  మద్య తోపులాటలు జరిగాయి. కొంతమంది రైతులను వ్యాన్‌లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మిగిలిన రైతులు రోడ్డుపై బైటాయించి వ్యానును అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు పోలీస్ వ్యాన్ పైకి రాళ్ళు విసరడంతో అద్దాలు పగిలిపోయాయి. దాంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసే వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులకు మద్దతుగా వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా రోడ్డుపై బైటాయించి ధర్నా చేసి నిరసన తెలియజేశారు. 

Related Post