తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

September 19, 2020
img

గత మూడు రోజులుగా హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి బారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అల్పపీడన ప్రభావమేనని తెలిపారు. ఈశాన్య, వాయవ్య బంగాళాఖాతంలో రేపు ఎల్లుండి అల్పపీడనం కొనసాగే అవకాశమున్నందున మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

హైదరాబాద్‌లో ఈరోజు అత్యధికంగా కుషాయిగూడలో 5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కోఠి, బేగంబజార్, బషీర్ బాగ్, నాంపల్లి, చాదర్ ఘాట్, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుక్‌నగర్‌, హయాత్ నగర్, నాగోల్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్,చైతన్యపురి,స ఆరూర్ నగర్, కర్మన్ ఘాట్, కొత్తపేట, మీర్ పేట, కీసర, దమ్మాయిగూడ, నాగారం తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తుండటంతో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళు నీట మునిగాయి. భారీ వర్షం కురుస్తుండటంతో కొన్ని ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

నేటి నుంచి రెండు మూడు రోజులపాటు మెదక్, సిద్ధిపేట, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

Related Post