విజయవాడ కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

August 10, 2020
img

విజయవాడలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 10 మంది రోగులు చనిపోగా మరో 18 మంది గాయపడ్డారు. విజయవాడలోని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం విజయవాడ-ఏలూరు రోడ్డులోని హోటల్ స్వర్ణప్యాలెస్‌ను అద్దెకు తీసుకొని దానిని కరోనా కేర్ సెంటరుగా మార్చి  కరోనా రోగులకు చికిత్స అందిస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన సమయం దానిలో మొత్తం 43 మంది రోగులున్నారు. వారిలో 31 మంది కరోనా రోగులు. వీరు కాక మరో 12 మంది ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. 

ఆదివారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు క్రిందనున్న రెసిప్షన్ కౌంటరులో గల పాత కేబిల్స్ నుంచి పొగలు మొదలయ్యాయి. క్షణాలలో మంటలు అంటుకొని అవి మొదటి రెండంతస్తులకు వ్యాపించాయి. దాంతో కొంతమంది రోగులు భయాందోళనలతో భవనం పైనుంచి క్రిందకు దూకడంతో చనిపోగా, మరికొందరు పొగలో చిక్కుకొని ఊపిరి ఆడక చనిపోయారు. సమాచారం అందుకొన్న అగ్నిమాపక శాఖ క్షణాలలో అక్కడకు చేరుకొని, ఓ పక్క మంటలు ఆర్పివేస్తూనే, మొదటి అంతస్తులో ఉన్నవారిని నిచ్చెనల సాయంతో క్రిందకు దింపి రక్షించారు. 

ఈ ఘటనపై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులందరికీ మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన రోగులు ఒక్కొక్కరికీ రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. 

Related Post