హైదరాబాద్‌లో మరో 2 వంతెనలకు కేటీఆర్‌ శంఖుస్థాపన

July 11, 2020
img

హైదరాబాద్‌ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ వంతెనలు, అండర్ పాసులు నిర్మిస్తూనే ఉంది. ఈరోజు నగరంలో మరో రెండు స్టీల్ బ్రిడ్జ్ లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపన చేశారు. వాటిలో ఒకటి ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు, మరొకటి రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు నిర్మించనున్నారు.  

మొదటిదశలో రూ.350 కోట్లు వ్యయంతో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నాలుగు లేన్ల ఎలివేటడ్ కారిడార్‌ నిర్మిస్తారు. రెండో దశలో రూ.76 కోట్లు వ్యయంతో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు మూడు లేన్లతో నిర్మిస్తారు. రెండూ కలిపి మొత్తం రూ. 426 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించబోతున్నారు.   

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు గత ఆరేళ్ళుగా నగరంలో కొత్తగా అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాము. ఈ రెండు ఫ్లై ఓవర్లు కూడా అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య కొంత తగ్గుతుందని భావిస్తున్నాము. లాక్‌డౌన్‌ సమయంలో నాలుగురెట్ల వేగంతో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరిగాయి. నగరంలో కొన్ని చోట్ల ఎలివేటడ్ కారిడార్లు, స్కైవేలు నిర్మించడానికి రక్షణశాఖకు చెందిన కొన్ని భూములు అవసరం ఉంది. కనుక కేంద్రంతో మాట్లాడి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించవలసిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిగారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

రాష్ట్రాలలో జరిగే అభివృద్ధిపనులకు రాజకీయాలకు అతీతంగా కేంద్రప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. 

Related Post