జోరుగా సాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు

July 08, 2020
img

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు చాలా జోరుగా...నిర్విరామంగా సాగుతున్నాయి. ఓ పక్క భవనాలు కూల్చివేస్తుంటే వెంటనే శిధిలాలను తొలగించి లారీలలో బయటకు తరలిస్తున్నారు. కనుక సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వేరే మార్గాలకు మళ్ళిస్తున్నారు. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, లక్డీకాపూల్, రవీంద్రభారతి, మింట్‌ కాంపౌండ్,  హిమాయత్‌నగర్‌ నుంచి సచివాలయంవైపు వెళ్ళే అన్ని మార్గాలను బ్యారికేడ్లతో మూసివేసారు. సచివాలయం కూల్చివేతను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక వాటి నుంచి ఎటువంటి అవాంతరాలు లేకుండా పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను కూడా మోహరించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, డిజిపి మహేందర్ రెడ్డి ఇద్దరి పర్యవేక్షణలో ఈ కూల్చివేతపనులు సాగుతున్నాయి. 

సచివాలయం ప్రాంగణంలో ఉన్న నల్లపోచమ్మ దేవాలయం కూల్చివేసే ముందు సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి మూలవిరట్టును వేరే ప్రాంతానికి తరలించారు. సమీపంలో గల మసీదులోని మతగ్రంధాలను ముస్లిం మతపెద్దలకు అప్పజెప్పి మసీదును కూడా కూల్చివేశారు. ముందుగా సచివాలయంలో ప్రసిద్ది చెందిన స్టోన్ బిల్డింగ్‌ను కూల్చివేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే సీ-బ్లాకును, దానితో పాటు జీ, హెచ్-నార్త్, సౌత్ బ్లాకులను కొంతవరకు కూల్చివేశారు. మంగళవారం సాయంత్రం డీ-బ్లాక్ కూల్చివేత పనులు మొదలుపెట్టారు. బుదవారం నుంచి ఏ, బీ, జె, క్‌ బ్లాకుల కూల్చివేత పనులు మొదలుపెడతారు. 

సచివాలయం కూల్చివేయడానికి మొదట ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి బాంబులను అమర్చి భవనాలను కూల్చివేయాలనుకొన్నప్పటికీ, సమీపంలో ఉన్న ట్యాంక్ బండ్ దెబ్బ తింటే అనూహ్యమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని పాత పద్దతిలోనే జేసీబీలను ఉపయోగించి కూల్చివేస్తున్నారు. కూల్చివేత పనులు నిరంతరంగా సాగుతుండటంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, దూళితో నిండిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా సచివాలయం సమీపంలోకి బయటివారిని ఎవరినీ అనుమతించడం లేదు. గజ్వేల్లో ఉంటున్న సిఎం కేసీఆర్‌కి సచివాలయం కూల్చివేతపనుల పురోగతి గురించి ఎప్పటికపుడు అధికారులు సమాచారం అందిస్తున్నారు. ఈ నెలాఖరులోపుగానే సచివాలయం కూల్చివేత, శిధిలాల తొలగింపు పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

Related Post