ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో దారుణం

June 29, 2020
img

కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులలో ఒకటైన ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వి.రవికుమార్ (34) రోగి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వైద్యులు వెంటిలేటర్ తొలగించడంతో నరకయాతన అనుభవించి చనిపోయాడు. చనిపోయే ముందు ఆసుపత్రి బయటే ఉన్న తన తండ్రికి తను పడుతున్న బాధను వీడియో సెల్ఫీ ద్వారా వివరించి చనిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

జవహర్ నగర్‌కు చెందిన రవికుమార్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండటంతో ఈనెల 23న అతని తండ్రి వెంకటేశ్వర్లు అతనిని వెంటబెట్టుకొని నగరంలోని 11 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఏ ఆసుపత్రిలో కొడుకును చేర్చుకోకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చి ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. రవికుమార్ తండ్రి అతనిని మరుసటిరోజు నీమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బుదవారం రాత్రి ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రికి తీసుకువెళ్ళి చేర్చారు. 

అతను ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడని గుర్తించిన ఎర్రగడ్డ ఆసుపత్రిలో వైద్యులు వెంటనే అతనికి వెంటిలెటర్ అమర్చారు. కానీ కొంతసేపు తరువాత ఏమయిందో తెలియదు దానిని తొలగించారు. దాంతో అతను ఊపిరి అందక నరకయాతన అనుభవించాడు. 

 “ఆక్సిజన్ తీయవద్దని నేను వైద్యులను బ్రతిమలాడినా పట్టించుకోలేదు. ఊపిరిపీల్చుకోలేకపోతున్నాను. ఇక నేను బతకను. నాన్న చనిపోతున్నాను. ఇక శలవు...” అంటూ రవికుమార్ తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో తన పరిస్థితిని చూపిస్తూ వీడియో తీసి తండ్రికి పంపించి చనిపోయాడు. 

కానీ ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ ఖాన్ ఈ వార్తను ఖండించారు. “అసలు రవికుమార్‌కు మేము వెంటిలేటర్ పెట్టనేలేదు కనుక దానిని తొలగించమనడం అబద్దం. మృతి చెందిన రవికుమార్ మయోకార్డైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. కరోనా వైరస్ సోకిన యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధి వచ్చినవారిలో చాలామంది గుండెకు ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. రవికుమార్‌ను మా ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే అతని పరిస్థితి విషమంగా ఉంది. అతని ప్రాణాలు కాపాడేందుకు మేము అన్ని ప్రయత్నాలు చేశాము కానీ దురదృష్టవశాత్తు చనిపోయాడు,” అని చెప్పారు. 

చనిపోయిన రవికుమార్‌ పంపిన వీడియో సందేశంలో ఆక్సిజన్ పెట్టకపోవడం వలననే ఊపిరి అందక చనిపోతున్నానని స్పష్టంగా చెప్పి చనిపోయాడు. మయోకార్డైటిస్ వ్యాధికి గురైనవారు గుండెకు ఆక్సిజన్ అందక చనిపోతున్నారని డాక్టర్ మహబూబ్‌ ఖాన్ స్వయంగా చెప్పారు. కానీ రవికుమార్‌కు వెంటిలెటర్ పెట్టలేదని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలననే రవికుమార్ చనిపోయాడనే కదా? అయినా రవి కుమార్ చనిపోయే ముందు నరకయాతన అనుభవిస్తూ ఎందుకు అబద్దం చెపుతాడు? ఒకవేళ అతను అబద్దం చెప్పిన చనిపోయేముందు తన పరిస్థితిని చూపిస్తూ రవికుమార్ పంపిన వీడియో ఉంది కదా? దానికి డాక్టర్ మహబూబ్‌ ఖాన్ ఏమి సమాధానం చెపుతారు? 

 రవికుమార్‌కు భార్య, ఓ కుమార్తె (12), ఓ కుమారుడు (9) ఉన్నారు. అతను చనిపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

Related Post