తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

June 02, 2020
img

కరోనా...లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యానికి నోచుకోని భక్తులకు శుభవార్త!ఈ నెల 8నుంచి దేశంలో అన్ని ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు తెరుచుకోవచ్చునని కేంద్రప్రభుత్వం ప్రకటించడంతో తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయాన్ని కూడా తెరిచేందుకు అనుమతి కోరుతూ టీటీడీ ఈవో ఏపీ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. దానిపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆలయంలోకి భక్తులను అనుమతించవచ్చని తెలియజేసింది. ఈ మేరకు  ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

అయితే ఇప్పుడు కరోనా నేపధ్యంలో ఇదివరకులాగ ప్రతీరోజూ లక్షమంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా భక్తుల మద్య కనీసం ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున మొదట్లో రోజుకు 5-10,000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా క్యూ లైన్లలో మార్పులు చేసింది కూడా. 

మొదట్లో తిరుమల, తిరుపతిలోని అనుబంద ఆలయాలలో ఉద్యోగులను, వారి కుటుంబాలను, ఆ తరువాత తిరుపతిలో నివశిస్తున్న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనాలకు అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. తాము తీసుకొంటున్న జాగ్రత్తలతో తిరుమలకు వచ్చే భక్తుల ద్వారా కరోనా వ్యాప్తి జరగకుండా అడ్డుకోగలుగుతున్నామని టీటీడీ భావిస్తే అప్పుడు ఇతర ప్రాంతాల వారిని దర్శనాలకు అనుమతించాలని భావిస్తోంది.

Related Post