అమెరికా వెళ్ళబోతే...కాటికి

February 13, 2020
img

అమెరికా వెళ్ళే ప్రయత్నంలో హైదరాబాద్‌ వచ్చిన ఒక సాఫ్ట్‌వేర్‌ దంపతులు, వారి ఇద్దరు కుమారులు ఫుడ్ పాయిజినింగ్ వలన ఆసుపత్రి పాలయ్యారు. వారి చిన్న కుమారుడు విహాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 

పోలీసుల సమాచారం ప్రకారం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లయిన రవినారాయణ రావు, శ్రీవిద్య దంపతులు అమెరికా వెళ్ళేందుకు వీసాల కోసం తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం రాత్రి బేగంపేటలోని మానస సరోవర్ హోటల్‌లో బస చేసారు. రాత్రి అదే హోటల్లో తయారుచేసిన కడాయ్ పన్నీర్ కర్రీని తిన్నారు. అది తిన్న కొద్దిసేపటికే నలుగురికి వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమిస్తున్నట్లు అనుమానం కలుగడంతో వారు వెంటనే హైదరాబాద్‌ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటికే వారి చిన్న కుమారుడు విహాన్ (2) పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు అతనిని ఐసీయూలో చేర్చి అత్యవసర చికిత్స చేశారు కానీ కొద్ది సేపటికే అతను మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తమ ముద్దుల కుమారుడు చనిపోయాడని తెలిసి ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.     

వారి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు విహాన్‌ది ‘అనుమానాస్పదమృతి’ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విహాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

జీహెచ్‌ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ రవీందర్ గౌడ్ తదితర అధికారులు మానస సరోవర్ హొటల్ చేరుకొని ‘పన్నీర్ కడాయ్’ మిగిలిన ఆహారపధార్ధాల శాంపిల్స్, రూములో నారాయణరావు కుటుంబసభ్యులు వాంతి చేసుకొన్న ఆహారపదార్ధాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వస్తే విహాన్ మృతికి కారణం తెలుస్తుంది.   

ఇక విషాహారం తినడం వలననే విహాన్ మృతి చెందాడా లేక వేరే ఏదైనా కారణంతో చనిపోయాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరోజు అదే హోటల్లో పన్నీర్ కడాయ్ తిన్న  మరో వ్యక్తి వివరాలు కూడా సేకరించి అతని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. 

అమెరికా వెళ్ళి గొప్పగా జీవించాలని కలలుగన్న రవినారాయణ రావు, శ్రీవిద్య దంపతుల జీవితాలను ‘పన్నీర్ కడాయ్’ తారుమారు చేయడమే కాక వారికి ఎన్నటికీ తీరని పుత్రశోకం మిగిల్చింది.

Related Post