నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం

January 24, 2020
img

తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగలలో ఒకటైన నాగోబా జాతార శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా ఆలయం ఉంది. ఆనవాయితీ ప్రకారం మెస్రం వంశంలో చనిపోయిన 63 మంది పెద్దలకు మోక్షప్రాప్తి కోసం మెస్రం వంశీయులు  గురువారం తెల్లవారుజామున నాగోబా ఆలయం వద్దగల మర్రిచెట్టు వద్ద తూమ్ పూజలు నిర్వహించారు.  



అనంతరం పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి అంటే ఈరోజు అర్దరాత్రి మెస్రం వంశీయులు నాగోబా ఆలయంలో మహాపూజలు నిర్వహిస్తారు. దీని కోసం వారు నాలుగైదు రోజుల ముందుగా కాలినడకన 150 కిమీ దూరంలో ఉన్న గోదావరిపాయలోని హస్తినమడుగుకు వెళ్ళి పవిత్రజలాలు తీసుకొనివస్తారు. ఆ జలాలతో నాగోబా స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత మెస్రం వంశంలో అడుగుపెట్టిన కొత్తకోడళ్ళు నాగోబా స్వామివారి దర్శనం చేసుకొంటారు. ఆ సందర్భంగా వారికి మెస్రం పూర్వీకుల గొప్పదనం గురించి వివరించే కార్యక్రమం ఉంటుంది. 


మహాపూజ, నాగోబా స్వామివారి అభిషేకంతో నాగోబా జాతర ఆరంభం అవుతుంది. నేటి అర్ధరాత్రి నుంచి ఈనెల 30 వరకు అధికారికంగా నాగోబా జాతర జరుగుతుంది. అది పూర్తయిన తరువాత మరో నాలుగు రోజులు అంటే ఫిబ్రవరి 3వరకు జాతర కొనసాగుతుంది. జనవరి 27న కేస్లాపూర్‌లో నాగోబా ఆలయ ప్రాంగణంలోనే ‘నాగోబా దర్బార్’ నిర్వహిస్తారు. 


నాగోబా జాతరకు ఆదిలాబాద్, నిజామాబాద్‌, పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు, మెస్రం వంశీయులు వేలాదిగా తరలివస్తున్నారు. కనుక నాగోబా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

Related Post