సూర్యాపేటలో సైదులు దర్గా ఉత్సవాలు షురూ

January 23, 2020
img

సూర్యాపేటజిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ గ్రామంలో నేటి నుంచి సైదులు దర్గా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుండి మూడు రోజులపాటు సాగే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. ముస్లిం మతగురువు మొయినుద్దీన్ అలియాస్ షహీద్ జాన్ పహాడ్ సైదులు బాబా పేరిట ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలలో రాష్ట్రంలోని ముస్లిం మతపెద్దలు, మత గురువులు కూడా పాల్గొంటారు. 

ఈ ఉత్సవంలో ప్రత్యేకత ఏమిటంటే అన్ని మతాలకు చెందినవారు పాల్గొంటారు. ఉత్సవం రెండవరోజున అంటే శుక్రవారం ఉదయం శాండల్ శరీఫ్ అనే ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారుచేసిన గంధం తీసుకువచ్చి గుర్రంపై ఊరేగించి, ఈ ఉత్సవ కార్యక్రమాలలో వినియోగిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా కవాలీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం దీపారాధనతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

Related Post