మేడారంకు పోటెత్తిన భక్తజనం

January 20, 2020
img

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 5 నుంచి 8వరకు జరుగుతుంది. జాతరకు తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు కనుక ఆ సమయంలో అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం కష్టమవుతుందని 10-15 రోజుల ముందుగానే భక్తులు తరలివస్తుంటారు. నిన్న ఆదివారం ఒకెరోజున సుమారు 3 లక్షలమంది భక్తులు తరలిరావడంతో అప్పుడే మేడారం జాతర కళ వచ్చేసింది. అయితే జాతరకు ఇంకా ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకేసారి అంతమంది భక్తులు పోటెత్తడంతో జిల్లా అధికారులు, సిబ్బంది కూడా చాలా ఇబ్బందిపడ్డారు.


సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌, డిజిపి మహేందర్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. ఇరువురూ అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని మొక్కులు తీర్చుకొన్నాక అధికారులతో సమావేశమయ్యి జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే శనిఆదివారాలకు మేడారం జాతర మరింత దగ్గర పడుతుంది కనుక మరింత భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది కనుక యుద్ధప్రాతిపాదికపై అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సోమేష్ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Related Post