దిశ కేసులో నిందితులు ఎంకౌంటర్?

December 06, 2019
img

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలుస్తోంది. వారిని విచారించేందుకు కస్టడీలోకి తీసుకొన్న పోలీసులు వారు దిశను సజీవదహనం చేసిన షాద్‌నగర్‌ సమీపంలో చటాన్‌పల్లి వద్దకు తీసుకువెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తుండగా వారు తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 

గత నెల 27వ తేదీ రాత్రి లారీ డ్రైవర్లు ఆరీఫ్ పాషా, చెన్నకేశవులు, క్లీనర్లు జొల్లు శివ, నవీన్ కలిసి ‘దిశ’ను సామూహిక అత్యాచారం చేసిన తరువాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అప్పుడు మరోసారి ఆమెపై లారీలో అత్యాచారం చేసిన తరువాత ఆమె బ్రతికి ఉండగానే చటాన్‌పల్లి బ్రిడ్జి క్రింద పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసును విచారించేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటైంది. కనుక ఈ కేసుకు సంబందించి కోర్టులో శాస్త్రీయంగా సాక్ష్యాధారాలు సమర్పించేందుకు పోలీసులు ఆ రోజు రాత్రి నేరం ఎక్కడ ఏవిధంగా జరిగిందో తెలుసుకొనేందుకు నలుగురు నిందితులను వెంటబెట్టుకొని నేరం జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్లినప్పుడు వారు తప్పించేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ వార్తను పోలీస్ శాఖ ఇంకా నిర్ధారించవలసి ఉంది.

తాజా సమాచారం: పోలీస్ కమీషనర్ సజ్జనార్ కొద్దిసేపటి క్రితం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు. నిందితులు పోలీసులపై రాళ్ళు రువ్వి తప్పించుకొనే ప్రయత్నం చేయడంతో వారిని ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసులు సజ్జనార్ కు తెలిపారు. ఘటన స్థలంలో నలుగురి మృతదేహాలను సజ్జనార్ పరిశీలిస్తున్నప్పుడు తీసిన వీడియో దృశ్యాలు ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ లోని ప్రసారం అవుతున్నాయి.

Related Post