మళ్ళీ రక్తమోడిన దేవరగట్టు

October 09, 2019
img

కొన్నిసార్లు ప్రమాదాలలో రోడ్లపై రక్తం పారుతుంటుంది అది చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ మతాచారాలు సంప్రదాయాల కోసం శరీరాన్ని కత్తులతో కోసుకొని, కర్రలతో తలలు పగులగొట్టుకొని రక్తం చిందిస్తుంటే నిసహాయంగా చూడవలసిరావడం చాలా బాధాకరమే. 

ఏపీలో కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం పరిధిలోగల దేవరగట్టు గ్రామంలో వెలిసిన మాల మల్లేశ్వరస్వామి వారి బన్నీ ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి రక్తం ఏరులైపారింది. 

ఆనవాయితీ ప్రకారం ఏటా స్వామివారి కల్యాణోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి ఊరేగిస్తారు. అప్పుడు స్వామివారి విగ్రహాన్ని దక్కించుకొని తమ గ్రామానికి తరలించుకుపోవడానికి మండలంలో గ్రామాల ప్రజలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకొంటుంటారు. స్వామివారి విగ్రహాన్ని తీసుకుపోయి పూజలు చేస్తే ఆ గ్రామానికి సకల శుభాలు జరుగుతాయని గ్రామస్తుల నమ్మకం. అందుకే మంగళవారం రాత్రి కూడా మండలంలోని నెరణి, కొత్తపేట తండా తదితర 8 గ్రామాలకు చెందిన ప్రజలు స్వామివారి విగ్రహాన్ని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. దానిలో భాగంగా వందలాదిమందిగా కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. 

ఏటా జరిగే ఈ బన్ని ఉత్సవం (కర్రల సమరం)లో ఇలాగే రక్తం ఏరులై పారుతుంటుంది. కనుక ప్రతీసారి జిల్లా రెవెన్యూ పోలీస్ అధికారులు గ్రామస్తులును ప్రశాంతంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోమని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈసారి కూడా వారంరోజుల ముందుగానే మండలంలోని గ్రామాల పెద్దలందరితో సమావేశం నిర్వహించి, ఒక్కో ఏడాది ఒక్కో గ్రామానికి స్వామివారి విగ్రహాన్ని తీసుకువెళ్ళి పూజలు నిర్వహించుకొనేలా గ్రామపెద్దలు ఒప్పందం చేసుకోవాలని ఈ కర్రల సమరం మానుకోవాలని నచ్చజెప్పారు. కానీ గ్రామస్తులు వారి మాటలు పట్టించుకోలేదు. పోలీసులు భారీ బందోబస్తు చేసినప్పటికీ ఒకేసారి వందలాదిమంది కర్రలతో యుద్ధానికి దిగడంతో నిసహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈసారి సుమారు 70 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం.

Related Post