కామారెడ్డిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

September 20, 2019
img

జనగామ జిల్లాలోని దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం సమీపంలో జనగామ-సూర్యాపేట రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా వస్తున్న డిసిఎం వాహనం డ్డీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.

మహబూబాబాద్‌ జిల్లా కొత్తబజార్‌కు చెందిన పెనుగొండ సదాశివుడు కుమారుడు సాయిశంకర్‌ లండన్‌లో ఎంబీఏ చదువుకోవడానికి వెళుతున్నాడు. కనుక సదాశివుడు దంపతులు, ఆయన ఇద్దరు సోదరులు, వారి కుటుంబ సభ్యులు అందరూ గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి అతనికి వీడ్కోలు పలికారు. 

అనంతరం వారిలో కొందరు హైదరాబాద్‌ తిరిగి వెళ్ళిపోయారు. సదాశివుడు భార్య మంజూష, ఆయన సోదరుడు గణేశ్-భార్య సుకన్య, మరో సోదరుడు పూర్ణచందర్-భార్య శ్రీలత కలిసి ఒక కారులో మహబూబాద్ బయలుదేరగా, సదాశివుడు తన సోదరుల కుమార్తెలు గాయత్రి, ప్రవీణలను తీసుకొని వేరే కారులో వరంగల్ కిట్స్ కాలేజీలో దింపేందుకు బయలుదేరారు. 

మహబూబాద్ బయలుదేరిన గణేశ్, మంజూష తదితరులు ప్రయాణిస్తున్న కారును కామారెడ్డిగూడెం సమీపంలో జనగామ-సూర్యాపేట రహదారిపై ఎదురుగా వేగంగా వచ్చిన డిసిఎం వాహనం డ్డీకొట్టడంతో కారు డ్రైవర్ నజీర్‌తో సహా గణేశ్, సుకన్య, అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీలత, మంజూషలను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించినప్పటికీ శ్రీలత మృతి చెందింది. మెరుగైన చికిత్స కోసం సదాశివుడు భార్య మంజూషను హైదరాబాద్‌లో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.

ఈ ప్రమాద సమాచారం అందుకున్న సాయి శంకర్ అబుదాబీ నుంచి వెనక్కు తిరిగి వచ్చాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు మరణించడంతో అందరూ బాధతో కుమిలిపోతున్నారు. 

Related Post