చిత్తూరులో ఘోరకారు ప్రమాదం..ఐదుగురు సజీవదహనం

September 14, 2019
img

చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోరకారుప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి జిల్లాలోని పలమనేరుకు వెళుతున్న ఒక కారు గంగవరం మండలం మామడుగు గ్రామం వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగాయి. ఆ కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో విష్ణు అనే వ్యక్తి అతికష్టం మీద బయటపడగలిగాడు కానీ మిగిలిన ఐదుగురు తప్పించుకోలేక మంటలలో సజీవదహనం అయ్యారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న విష్ణు అనే ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలు, చెల్లి, ఆమె కూతురితో కలిసి బెంగళూరు నుంచి కారులో పలమనేరు తిరిగివస్తుండగా ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బహుశః నిద్రమత్తులో అతివేగంగా కారు నడుపుతుండటం వలననే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు విష్ణును స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేసి వారి శవాలను వెలికితీశారు.

Related Post