సత్య నాదేళ్ళ తండ్రి యుగంధర్ మృతి

September 14, 2019
img

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్ళ తండ్రి బుక్కాపురం నాదేళ్ళ యుగంధర్ (80) హైదరాబాద్‌లోని తమ నివాసంలో శుక్రవారం కనుమూశారు. ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఆయన 2004-2009 వరకు ప్రణాళికా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఆ తరువాత దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక అత్యున్నత పదవులలో పనిచేసినప్పటికీ అత్యంత నిరాడంబరంగా, స్నేహపూర్వకంగా ఉండేవారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఆయన స్నేహితుడు. కానీ ఏనాడూ తమ స్నేహాన్ని దుర్వినియోగం చేయలేదు. ప్రధానిగా గౌరవిస్తూనే స్నేహాన్ని కొనసాగించేవారు. గ్రామీణాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం తన స్థాయిలో విశేషకృషి చేశారు. యుగంధర్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి అంత్యక్రియలలో పాల్గొనేందుకు సత్య నాదేళ్ళ అమెరికా నుంచి బయలుదేరినట్లు సమాచారం. 


Related Post