హైదరాబాద్‌లో మళ్ళీ ట్రాఫిక్ జామ్

September 13, 2019
img

ఇటీవల కాలంలో హైదరాబాద్‌ నగరంలో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుండటం, అది కూడా ఓ వార్త అవుతుండటం విశేషం. గణేశ్ శోభాయత్ర కోసం ట్రాఫిక్ పోలీస్ శాఖ గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు తొలగిపోవడంతో నగరంలో అన్నివైపుల నుంచి బస్సులు, వాహనాలు రోడ్లపైకి వచ్చేశాయి. కానీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఇంకా గణేశ్ నిమజ్జనాలు పూర్తికాకపోవడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 

సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట, రాణీగంజ్, అమీర్ పేట, పంజగుట్ట, ఖైరతాబాద్‌ మార్గాలలో, అలాగే బషీర్ బాగ్, అబీడ్స్, బీఆర్‌కె భవన్‌ నుంచి ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం జూబ్లీహిల్స్, మాధాపూర్ ప్రాంతాలపై కూడా పడటంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం నిన్నటి నుంచి ఇప్పటివరకు సుమారు 2,000 విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయగా మరో 5-600 విగ్రహాలు దారిలో ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు వాటి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది కనుక అప్పటి వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ కొనసాగవచ్చు. కనుక నగర ప్రజలు దీనిని గమనించి వేరే మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలు చేరుకోవడం మంచిది.

Related Post